పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం

Site: Dr. B.R. Ambedkar Open University Online Learning Portal
Course: గణితశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన
Book: పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం
Printed by: Guest user
Date: Wednesday, 15 April 2026, 1:46 AM

Description

పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం

1. పాఠ్య ప్రణాళిక/పీరియడ్ పథకం

ఏ స్థాయిలోనైనా ప్రతి ఉపాధ్యాయుడు, అనుభవం కలిగి ఉన్నా, లేక పోయినా, ప్రారంభదశలో ఉన్నా, తాను చెప్పబోయే పాఠ్యాంశానికి ముందుగానే పథకం సిద్ధం చేసుకొనిన తరువాతే బోధించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయుట వలన ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది. అనుకున్న లక్ష్యాలు పూర్తిగా నెరవేరుతాయి.
"ప్రతి పాఠ్యాంశ బోధనకై ఏర్పరచుకున్న కార్యాచరణ పథకమే పాఠ్యపథకము”. ఒక ప్రత్యేక పాఠ్యాంశాన్ని ఎందుకు బోధించాలి? ఏమేమి విషయాలు బోధించాలి? ఏ పద్ధతిలో బోధించాలి? మనం ఆశించిన విధంగా బోధించగలమా? లేదా? అనే విషయాలన్నీ పాఠ్యపథకంలో స్పష్టంగా వివరించబడుతాయి.
ఉపాధ్యాయులు, విద్యార్థులలో సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనాంశాలు, బోధనాభ్యసన సామాగ్రి, బోధనా పద్ధతులు మొదలైన అంశాలకు సంబంధించి ఒకే ప్రణాళికను తయారుచేసుకున్నట్లయితే బోధన సులభతరం అవుతుందని
మనకు తెలుసుగదా! ఒకే క్రమపద్ధతి, ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సరం కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి లక్ష్యాలు, సమయం ముందుగా నిర్ణయించుకోవాలి. తరగతి బోధనను ఒక వ్యవస్థగా అనుకుంటే, ఆ వ్యవస్థలో అనేక ఉప వ్యవస్థలు ఉంటాయి. ఉప వ్యవస్థలు విశ్లేషిస్తే గానీ  వస్థను మెరుగుపరచలేము. సూక్ష్మబోధన సాధారణ తరగతిలో ఉండే బోధనలోని సంక్లిష్టతలను తగ్గించటానికి కావలసిన శిక్షణా వాతావరణాన్ని అందిస్తుంది. సూక్ష్మబోధనా నైపుణ్యాల ద్వారా ఛాత్రోపాధ్యాయులు తరగతి గది లక్ష్యాలను చక్కగా సాధించవచ్చు. వివిధ నైపుణ్యాలతో పాటు సాంవత్సరిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక మరియు పీరియడ్ ప్రణాళికల అవగాహన కూడా ఉపాధ్యాయులకు అత్యవసరం. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆధారంగా తరగతి బోధన కూడా మార్పు
చెందాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయక పీరియడ్ పథకాలతో పాటంగా నూతనంగా వచ్చిన రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణా సంస్థ వెలువరించిన నిరంతర సమగ్ర మూల్యాంకన ఆధారిత, పీరియడ్ పథకం యొక్క అవగాహన ఛాత్రో పాధాయులుకు తప్పనిసరిగా ఉండాలి. 
బోధనా విధానంలో పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుడు బోధంచవలసిన పాఠ్యాంశం ద్వారా సాధించవలసిన లక్ష్యాలు, ఉపయోగించవలసిన బోధనా పద్ధతులు, బోధనాభ్యసన సామాగ్రి, అభ్యసనా కృత్యాలు, మూల్యాంకనా విధానం ఏ విధంగా ఉండాలో పాఠ్యపథకం ప్రతిబింబిస్తుంది. పాఠ్యపథకాన్ని “సమీప భవిష్యత్తులో తీసికోవలసిన చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని" అనవచ్చు. యూనిట్లోని సబ్ యూనిట్లో ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకాన్ని పాఠ్యపథకం లేదా పీరియడ్ పథకం అంటారు.

2. పాఠ్యప్రణాళిక-నిర్వచనాలు

1. సమీప భవిష్యత్తులో జరుగబోయే చర్యకొరకు రూపొందించబడ్డ పథకమును లేక మార్గదర్శిని పాఠ్యపథకమంటారు. సామాన్య భాషలో చెప్పాలంటే బోధింపబోయే పాఠాన్ని “ఎలా బోధించాలి” అన్న ప్రశ్న కోసం ముందుగా రూపొందించుకొన్న
ప్రణాళికను పాఠ్యపథకమంటారు.
2. లెస్టర్ బి. సేండ్స్ మాటల్లో "పాఠ్యపథకమనేది ఖచ్చితంగా ఒక కార్యాచరణ “పథకము.” కాబట్టి పాఠ్యపథకం బోధన సమయంలో తరగతిగదిలో జరగబోయే ప్రక్రియలన్నింటిని కళ్లముందు ఉంచుతుంది. పాఠ్యపథకం యొక్క సఫలతం జరగబోవు కార్యక్రమాన్ని చక్కగా ఊహించటంలో ఉంటుంది.

3. పీరియడ్ పథక ప్రయోజనాలు

పాఠ్యాంశం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను ముందుగా స్పష్టంగా ఏర్పరచవచ్చు.
నిర్ణయించుకున్న లక్ష్యాలను తక్కువ శ్రమతో సులభంగా పాఠ్యబోధన ద్వారా సాధించవచ్చు.
పాఠ్యాంశ విషయాలను తార్కికంగాను, క్రమబద్ధంగాను బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు ఆత్మ స్థైర్యంతో, ఆసక్తిగా పాఠ్యాంశాన్ని బోధిస్తాడు.
అందుబాటులో ఉన్న వనరులు, పరికరాలతో బోధనను చక్కగా కొనసాగిస్తారు.
పాఠ్యాంశ బోధనకు పూర్వం, బోధించే సమయంలో, బోధన పూర్తయిన తర్వాత చేయవలసిన అంశాలను (నియోజనాలు, మూల్యాంకన ప్రశ్నలు, కృత్యాలు) క్రమబద్ధంగా తయారు చేసుకోవచ్చు.
సమయం వృథాకాకుండా బోధించవచ్చు.
ఉపాధ్యాయుడు పాఠ్యాంశ బోధనకు మానసికంగా సిద్ధమవుతూ, సందర్భోచిత ఉదాహరణలు, దృష్టాంతాలు, కృత్యాలు ఎన్నుకొని ఉపయోగించగలడు.
ఉత్తమ పాఠ్య ప్రణాళికకుండవలసిన లక్షణములు:
1. సాధించవలసిన లక్ష్యములు స్పష్టముగాను, నిర్ధేశించిన సమయంలో బోధన పూర్తి అయ్యేవిగాను ఉండాలి.
2. లక్ష్యములు సాధింపబడినది, లేనిది ఖచ్చితముగా తెలుసుకొనుటకు తగిన మూల్యాంకన పద్ధతులు నిర్దేశించబడాలి.
3. పూర్వజ్ఞానము ఆధారముగా నిర్మించబడాలి.
4. బోధనా ప్రక్రియలో జరిగే రూపణ మూల్యాంకనము విద్యార్థుల నిత్యజీవిత అనుభవాలపై ఆధారపడి ఉండాలి.
5. అందుబాటులో నుండే వనరులను బోధనోపకరణములుగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనేటట్లు ఉండాలి.